|
ఈ శతాబ్ది తొలి అభ్యుదయ కావ్యకిరణాల్లో ఒక మహత్తరమైన ఉషఃకిరణం వజ్రాయుధం. ఒక కొత్త బొమ్మను చూడగానే గంతేసి చేజిక్కించుకునే పసివాడి లాంటిది సోమసుందర్ సారస్వత హృదయం - సదానిర్మలమైన శైశవ జగత్తులాంటిది ఆయన కావ్యాత్మ. తరం, ప్రాంతం, వయసు లాంటి శృంఖలాలెరుగని కావ్యాత్మ సాహిత్య విమర్శలో సంధించిన మరో వజ్రాయుధం శేషేంద్రజాలం. కావ్యం - కావ్య విమర్శల తాదాత్మ్యా నికి ఈ శతాబ్దిలో ఒకే ఒక నిఖార్సైన నిదర్శనం సోమసుందర్ శేషేంద్రజాలం.
- ఇంద్ర ప్రసాద్
***
భావ కవిత్వ యుగం సమాప్తమైపోయిన తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చిన వారిలో శ్రీశ్రీ.. నారాయణబాబు, పఠాభి, ఆరుద్ర, సోమసుందర్ తదితరులు ప్రముఖులు. నారాయణబాబు, పఠాభి లయరహితమైన వచన కవితలు రాయగా శ్రీశ్రీ.. సోమసుందర్ గేయ ఛందస్సుల్లో కవితలల్లారు.
అభ్యుదయ ఉద్యమం ఆటుపోట్లు, దిగంబర కవులు, విరసం ఆవిర్భావం తదితర సాహిత్య క్షేత్రంలోని 'వర్గ పోరాటాల్లో' కావ్య లక్షణాలు వెనుకంజ వేయసాగాయి. సన్నగిల్ల నారంభించాయి. కొందరు ఉత్సాహవంతులు 'కవి' పదవి కోసం రంగప్రవేశం చేశారు. కవిత క్షామ పీడనకు గురైంది. శేషేంద్ర కావ్యం మండే సూర్యుడు మినీ కవితా సంకలనం సోమసుందర్ దృష్టిని ఆకర్షించింది. వచన కవితా పితామహుడు కుందుర్తిగారు ఫ్రీవర్స్ ఫ్రంట్ ద్వారా వచన కవిత వ్యాప్తికోసం చేసిన కృషి అంచనాకు అతీతం. కవిత్వాన్ని జనసామాన్యం దైనందిన జీవితంలో భాగంగా మలచడంలో చరితార్థుడయ్యాడు కుందుర్తి. దీపాన్నంటుకునే చీకటి వున్నట్లు ఉద్యమం నీడన కొన్ని అవాంఛనీయ ధోరణులు బలపడ్డాయి. అభివ్యక్తి, వైచిత్రి రహితమైన వచనం కవితగా ప్రాచుర్యం పొందింది. ఈ ధోరణి నిర్మూలన కోసం అన్నట్లుగా వచ్చాడు శేషేన్ మండే సూర్యుడు, కవిత్వానికుండవలసిన సూటిదనం. అనల్పాక్షర, క్లుప్తపద, వాక్యప్రయోగం, కొత్త వ్యక్తీరణలను తీక్షణంగా ప్రసరించాడు మండే సూర్యుడు. కవిత్వం అందులోనూ మినీ కవిత ఒక ఉద్యమస్థాయిలో పయనించసాగింది. దాదాపు 25సంవత్సరాల అనంతరం శేషేంద్రజాలం రెండవ ముద్రణ పొందింది. ఉద్యమాల రణగొణ ధ్వని దెబ్బకు కవిత క్రమేణా తెరమరుగవుతున్న కాలంలో ఇది రావడం ముదావహం. కావ్యం, కావ్యవిమర్శ రెండింటా సవ్యసాచి అయిన సోమసుందర్ యుగసంధిలో శేషేంద్ర జాలాన్ని వెలువరించి ఒక సద్విమర్శకుడిగా తనను చరితార్థం చేసుకున్నాడు.
- ఆదివారం, వార్త
వార్త దినపత్రిక, 17 డిసెంబరు, 2000
***
ఉత్తమ కవిత్వం గతాన్ని జీర్ణించుకొని వర్తమానంలో పుట్టి సమకాలీన చైతన్యాన్ని గర్భీభూతం చేసుకొని ఆగతం వైపుగా సామాజికులను నడిపించాలి. సరిగ్గా ఈ లక్ష్యలక్షణ సమన్వితమైన ఉత్తమకావ్యం శేషేంద్ర 1974లో విడుదల చేసిన 'మండే సూర్యుడు'. ఆ కావ్యం తన ఉన్నిద్రతేజంతో రాగల ఇరవయ్యొకటో శతాబ్దికి తన చూపుడు వేలు నిడిగిస్తోంది. ఆ కావ్యంలో వినూత్నకాంతులతో ప్రచలితమైన నూతన అభివ్యక్తులు సమకాలీన కవులపై విశిష్టమైన ప్రభావాన్ని కలిగించడమే ఆ కావ్యశక్తికి నికషోపలం.
'మండే సూర్యుడు' అనే కవిత 2-10-74న హైదరాబాద్ రేడియో కవి సమ్మేళనంలో మొదటిసారి ప్రసారమయింది. అప్పుడే గొప్ప సంచలనం రేపింది. అదే 13-11-74 ఆంధ్రప్రభ వారపత్రికలో 'మనిషిని చెక్కిన శిల్పి' అనే శీర్షికతో ప్రకటితమయింది.
సూర్యుడు అనే ప్రతీక ఇతః పూర్వం చాలామంది కవులు ప్రయుక్తం చేసిందే అయినా మహత్తరశక్తి సంపన్నంగా ఈ 'మండే సూర్యుడు' అనే కవితలో ప్రచలితం కావడం వల్ల ఈ ప్రతీక చాలా మందిని ప్రభావితుల్ని చేసింది. ఈ కవితాసంపుటి పాఠక హృదయంలో సహస్రయోచనా కిరణాలను ప్రసరిస్తుంది. ఈ కావ్యాన్ని ఆసాంతం చదివి ముగించిన రసజ్ఞునికి మానసికంగా విచిత్రానుభూతి కలుగుతుంది. ఏదో కడుపులో తిప్పుతున్నట్లు, ఒడలు జోగుతున్నట్లూ అశాంతి కదలబారుతుంది. నిండు భోజనంలో మొహమాటపడి తిని భుక్తాయాసమనుభవిస్తున్నట్లు ఒక ఊపు ప్రారంభమవుతుంది. తన లోంచి తనకే తెలియని రీతిగా ఒక నూత్న మానవుడు - మృత సంజీవినీ మంత్రాన్ని నేర్చుకున్నవాడు, ఆవిర్భవిస్తున్నట్లుగా ఒక వాంఛనీయ విపత్తు ఆసన్నమవుతుంది. ఉత్తమ కవితను అనుభవిస్తున్నప్పుడు కలగవలసిన పారవశ్యస్థితి అంటే ఇదే. దీన్ని 'మండే సూర్యుడు' మనకు అపారంగా లభించజేస్తుంది.
- ఆవంత్స సోమసుందర్
***
1974 లో వెలువడ్డ శేషేంద్ర మండే సూర్యుడు కవితా సంకలనం కాదు ఒక కవితా సంచలనం. మండే సూర్యుడి ప్రభావం విస్తృతం అనంతం. 1976 లో వచ్చిన సోమసుందర్ శేషేంద్ర జాలం అదే సంచలనం సృష్టించింది.
ఆ తరం సాహిత్య ప్రపంచం అస్తమించింది. రాగ ద్వేషాల మయమయిన ఆ కాలం పోయింది.
ఇది కొత్త యుగం కొత్త తరం.
మండే సూర్యుడు, శేషేంద్ర జాలం - నేటి కాలం కోసం ఈ రెండు రచనలు అందుబాటులోకి వస్తున్నాయి. శేషేంద్ర జాలం సద్విమర్శలో ఒక కల్పవృక్షం. ప్రతి చర్చలో అసంఖ్యాక ఉప చర్చలు - సాహిత్యాభిరుచి ఉన్న సునిశిత పాఠకుడికి, పరిశోధకులకు, సాహితీ వేత్తలకు పసందయిన విందు ఇస్తుంది.
కవి కుమారులు, స్వతహాగా కవులు అయిన శశికాంత్ శాతకర్ణి, సాత్యకి
శ్రీ శార్వరి నామ ఉగాది కానుకగా సాహిత్య జగత్తుకు శేషేంద్ర జాలం బహుకరిస్తున్నారు.
Books :
Contact :
Satyaki S/o Seshendra Sharma
+91 7702964402 , 9441070985