|
Sahitya Darsini : Letters Interviews & Essays
శేషేంద్ర సృజన రచయిత మాత్రమే కాదు. విమర్శకుడు కూడా. విమర్శించే కావ్యంలో విమర్శకులు పరిశీలించాల్సిన అంశాలు ఆయన దృష్టిలో మూడు. ఒకటి అలంకారం, రెండు భాష, మూడు వస్తువు. మూడూ మూల ద్రవ్యాలే అయినా వీటిలో సృష్టి అనదగినది మాత్రం అలంకారమేనంటాడు. అలంకార సృష్టి క్రమంలో భాష కూడా మార్పు చెందుతుందని చెబుతాడు. ఈ విమర్శ సూత్రాన్ని శేషేంద్రకే అన్వయిస్తే ఆయన కవిత్వం ప్రధానంగా అలంకారమయం - ఉపమను ప్రతీక స్థాయికి ఎదిగించి కవిత్వాన్ని జెండాగా ఎగరేశాడాయన. ఆ క్రమంలోనే నూతన భాషను సృష్టించాడు. వస్తువు దాని ఔగాములు, సంబద్ధాలు, సందర్భాలు, విప్లవోద్యమ గమనంతో, తాత్వికతతో వున్న సంవాదం పూర్తిగా అప్రధానం అయిపోయాయి. వాటి మీద జరగవలసిన చర్చ, విశ్లేషణ జరిగితేనే కానీ శేషేంద్ర కమ్యూనిజాన్ని ఎలా అర్థం చేసుకొన్నాడు. ఏ మేరకు స్వీకరించాడు అనే విషయాలు తేలవు.
కవిత్వానికి గీటురాయి అనుభూతి అన్నది శేషేంద్ర నిశ్చితాభిప్రాయం. జీవితంలో అనేక అనుభూతులుంటాయి. స్వానుభూతి కావచ్చు, సహానుభూతి. దానితో పాటు ప్రేమ మొదలైన అనుభూతులు వుంటాయి అంటాడాయన. ఎప్పుడు ఏది అనుభూతికి వస్తే అప్పుడది కవితాంశం అవుతుంది. అయితే విప్లవం ఒక అనుభూతి వస్తువు మాత్రమేనా? సామాజిక వాస్తవికత, సిద్ధాంతం, ఆచరణ, వ్యూహం, పోరాటం వీటితో సంబంధంలేని అమూర్తాంశంగా దానిని చూడవచ్చునా? అట్లా చూడడం వల్లనే కమ్యూనిజం నాలో స్పందించే ఏతారా అని ఎంతగా చెప్పుకొన్నప్పటికి శేషేంద్ర విప్లవ కవిగా గుర్తింపును పొందలేకపోయాడా? - శేషేంద్ర కవిత్వాన్ని ఇప్పుడీ కోణం నుండి అధ్యయనం చేయాలి.
శేషేంద్ర వ్రాసిన సాహిత్య విమర్శ రచనలను పరిశీలించినా ఆయన వ్యక్తిత్వంలోని వైచిత్రి అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవులను, విప్లవ కవిత్వాన్ని ఆయన వ్యక్తిత్వంలోని వైచిత్రి అర్థమవుతుంది. సమకాలీన తెలుగు కవులను, విప్లవ కవిత్వాన్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. వర్గ చైతన్యాన్ని వ్యక్తిగత సంస్కారంగా చూచాడు. కనుకనే పోరాటాలు వ్యక్తిగతంగా ఏర్పడతాయని చెప్పాడు ఆ విప్లవ కవిత్వముత సాహిత్య విమర్శ వంటి వ్యాసాలలో. ఇక ప్రధానంగా ఆయన విమర్శ సంస్కృత సాహిత్యం పైననే జరిగింది. హర్షనైషధాన్ని విమర్శించినా, వాల్మీకి రామాయణాన్ని విమర్శించినా వాటిని మంత్ర యోగ వేదాంత శాస్త్ర సంపుటులుగా ప్రతిపాదించాడు. శబ్దార్థాలకు అతీతమైన చమత్కారాన్ని కావ్యం నుండి ఆస్వాదించటం, అనుభూతి చెందటం గురించే ఆయన వివరణలు విశ్లేషణులున్నాయి. గజల్ ప్రక్రియ ఆయనను అమితంగా ఆకర్షించిందీ అందువల్లనే. మొత్తంమీద ప్రవృత్తి చమత్కార రామణీయకము ఆదర్శం ఆకాంక్ష విప్లవం అయితే అది గుంటూరు శేషేంద్రశర్మ. రూపానికి సారానికి వున్న వైరుధ్యాన్ని సమన్వయించుకొనటంలో పరిష్కరించుకొనటంలో కవిగా, విమర్శకుడుగా శేషేంద్ర శర్మ సాధించిన విలువలేమిటో అంచనా వేయటానికి అధ్యయనం కొత్తగా ప్రారంభం కావాలిప్పుడు.
- డా. కాత్యాయనీ విద్మహే
***
శేషేంద్ర పుస్తకాలను సమీక్షించడమే దుస్సాహసం. ఆధునికతనూ, సంప్రదాయాన్ని మేళవించి కవితకు సరికొత్త రూపునిచ్చిన శేషేంద్రకు రసదృష్టి, శ్రామిక పక్షపాతం రెండుకళ్లు. చేతులెత్తి గ్రీష్మానికి / చెమట బొట్టు మొక్కింది / గగనానికి ఇంద్రధనుస్సు కలగాలని కోరింది -
అనడంలోనే పై రెండు లక్షణాలు స్పష్టమవుతాయి. తన తొలిదశ కావ్యమైన 'ఋతుఘోష'లో విశ్వనాథాదులు అబ్బురపడేలా చెప్పిన రసవంతమైన పద్యాలు మరోమారు మనముందుకు వచ్చాయి. కదిలించే కవిత్వమే కాదు... అద్భుత కథలూ ఆయన కలం నుంచి జాలువారాయన్న విషయం 'విహ్వల' పుస్తకం చదివినవారికి తెలుస్తుంది. ఇందులోని 'మబ్బుల్లో దర్బారు' ఓ గొప్ప నాటిక. అధికార బలంతో భూమి అంతా నాదేనని విర్రవీగి మానవుడికి పంచభూతాలు బుద్ధిచెప్పడం దీని ఇతివృత్తం. నాటిక అద్యంతం సునిశిత హాస్య వ్యంగ్య ధోరణిలో సాగి శేషేంద్ర కలం బలాన్ని వెల్లడిస్తుంది. వివిధ కాలాల్లో శేషేంద్ర రాసిన సుప్రసిద్ధ కవితలు, పద్యాలు, ఖండికలు కూడా వీటిలో చోటు చేసుకున్నాయి. సాహిత్యాభిమానులను తప్పనిసరిగా అలరించే పుస్తకాలివి. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా వీటిని ప్రచురించారు.
- చంద్రప్రతాప్
ఈనాడు
***
ఈ ఉషస్సు ఎన్ని తీరాలు ఎన్ని తుఫానులు
ఎన్ని ఉదయాస్తమయాలు దాటి వచ్చిందో
నలుదిక్కులా ముసిరి విసిరే ఈ నూతన
వన పవనాలతో కలసి
ఒక కొత్త గొంతెత్తి కేక వేస్తోంది
అది ఒక కొత్తకల ఆది ఒక కొత్త ఆల;
మనమీదికి దూకుతున్న అల....
ఈ ఉషస్సు కురిసే రక్తిమలో
స్నానంచేసి మానవుడు శుచి ఐ
ఆకాశాన్ని తన్నే సముద్రతరంగంలా
మన తీరాలమీదకు విరుచుకుపడుతున్నాడు;
మనుషుల్ని విభజించే ఇనప తెరల్ని త్రెంచి
దళిత జీవుల మొరల్ని
ఒరల్లో ఖడ్గాలుగా ధరిస్తున్నాడు!
ఓహ్! మన మనోద్వార తోరణానికి
మానవతా సూర్యుడు జ్వలత్ జ్వాలాగుచ్ఛమై
వ్రేలాడుతున్నాడు.
భాషలు ఆరవేసిన వలువల్లా ఎగిరిపోతున్నాయి
దేశాల సరిహద్దులు ఈ ఝంఝామారుతాల ధాటికి
గజగజ వణకిపోతున్నాయి.
మానవత నగ్నంగా ఉద్విగ్నంగా
నూతన వ్యక్తీకరణకోసం చూస్తోంది
దిశాంచలాల్లోకి.
- (శేషజ్యోత్స్న - 1973)
***
మహా కవి శేషేంద్ర 94వ జయంతి సందర్భంగా కవి కుమారుడు సాత్యకి అందిస్తున్న అరుదైన కానుక
***
Seshendra : Visionary Poet of the Millenium
http:// seshendrasharma.weebly.com